Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

30 వేల మంది రైతన్నలతో చరిత్రను తిరగరాసే ఉద్యమం ఇది

నేడు దేశమంతా ముంబై వైపు చూస్తోంది. రైతన్న ఒక్కో అడుగు వేసుకుంటూ ముంబై చేరుకున్నాడు. వ్యవసాయంపై ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతూ.. రైతులు చేపట్టిన ఈ నిరసన యాత్ర ముంబైలోని ఆజాద్ మైదాన్ చేరుకోవడంతో ముగిసింది. ఇదిలా ఉంటే రైతుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతూ అండగా నిలిచి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు ముంబై వాసులు. పాదయాత్ర ముంబైలోని ఆజాద్ మైదానానికి చేరుకుంటున్న సమయంలో గొంతెండిన రైతులకు నీళ్లు అందించారు. బిస్కట్లు ఇచ్చి కడుపు నింపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ అవుతున్నాయి. కొంతమందికైతే కాళ్లకు చెప్పులు కూడా లేవు. వాళ్లను చూసి చలించని వాళ్లు.. కన్నీళ్లు పెట్టని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. రైతుల కష్టాలకు చలించిన ముంబై అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల డిమాండ్లు నెరవేర్చాలంటూ గొంతెత్తారు.

రుణమాఫీ కోసం మహారాష్ట్ర అన్నదాత రోడ్డెక్కాడు. ఎర్ర జెండా చేత పూనిన సుమారు 30 వేల మంది రైతులు రాష్ట్ర అసెంబ్లీని స్తంభింపజేయాలని 180 కిలోమీటర్ల కవాతు చేసుకుంటూ కదిలారు. కొద్ది రోజుల క్రీతం నాసిక్‌లో మొదలు పెట్టిన ఈ యాత్ర నేడు ముంబై చేరుకుంది. ఫడ్నవీస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ ఆలిండియా కిసాన్ సభ ఈ మార్చ్‌ను నిర్వహిస్తోంది. కాగా ఈ మార్చ్‌పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆరా తీశారు. పూర్తి రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని సోమవారం ఉదయమే అసెంబ్లీ ముందు ‘ఘెరావ్’ చేయనున్నారు. 6 రోజులు కోనసాగిన వీరి యాత్ర ఎట్టకేలకు ముంబై చేరుకోవడంతో ప్రభుత్వంలో కదలికలు ఎక్కువయ్యాయి.

అఖిల భారతీయ కిసాన్ సభ (ఏబీకేఎస్) ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన ‘మెగా మార్చ్’ ఆదివారం ముంబైకి చేరుకుంది. 35,000 మందికి పైగా రైతులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈనెల 5న నాసిక్ నుంచి పాదయాత్రగా వీరు బయలుదేరారు. మొత్తం 180 కిలోమీటర్ల ప్రయాణించి ముంబై చేరుకున్నారు. రైతుల పూర్తి రుణమాఫీ అమలు, విద్యుత్ బిల్లుల మాఫీ, స్వామినాథన్ సిఫారస్సుల అమలు చేయాలన్నవి రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని, రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్లు పెంచాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో పాటు మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. రైతులంతా సోమవారంనాడు మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రైతుల మహా ధర్నాకు శివసేన, ఎంఎన్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. కాగా, రైతు సమస్యలపై దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా రైతులు కోరుతున్న డిమాండ్లలో ఎక్కువ కేంద్రం పరిధిలోకి వస్తుండటంతో ఫడ్నవిస్ రైతులతో వెంటనే చర్చించే అవకాశాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.