Wednesday, December 12, 2018
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

ఇక‌పై సిమ్ కార్డ్ అవ‌స‌రం లేదు..కాల్స్,డేటాకు అడ్డే లేదు..

టెక్నాల‌జీ ఎంత స్పీడ్ గా అప్ గ్రేడ్ అవుతుందో జ‌నాలు కూడా అంతే అప్ డేట్ అవుతున్నారు.ప్ర‌తి ఒక్క‌రూ చేతిలోనే ప్ర‌పంచాన్ని చూస్తుండ‌టంతో ఎక్క‌డ చీమ చిటుక్కుమ‌న్నా ఇట్టే తెలుసుకోగ‌లుగుతున్నారు.ఇక అదే టెక్నాల‌జీ రోజురోజుకీ త‌న రూపురేఖ‌ల‌ను కూడా మార్చుకుంటోంది.ఇంత‌కు ముందు కంప్యూట‌ర్ చాలా పెద్ద‌దిగా ఉండేది.దాని కోసం సీపీయూ,మానీట‌ర్,యూపీఎస్ ఇలా పెద్ద మోత‌బ‌రుగే ఉండేది.ఇప్పుడు ల్యాప్ టాప్ లు,టాబ్ లు,స్మార్ట్ పోన్లు ఇలా సులువుగా చేతుల్లోకే వ‌చ్చేశాయి. ఫోన్ ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకున్నా ల్యాండ్ లైన్ నుంచి హ్యాండ్ ఫోన్ల వ‌ర‌కు ఎన్నో ర‌కాలుగా అప్ డేట్ అవ‌డాన్ని చూస్తున్నాం.ప్ర‌స్తుతం అర‌చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ చేతికి గ‌డియారం మాదిరిగా వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే..

ఇక‌పోతే ప్ర‌స్తుతం ఫోన్ వాడుతున్న ప్ర‌తిఒక్క‌రు దాదాపుగా రెండు సిమ్ ల‌ను మెయింటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఆ సిమ్ ల ప‌రిమాణం గ‌తంలో పెద్ద‌గా ఉండేవి.కానీ ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. నానో సిమ్ ల‌కు పోటీగా ఇ-సిమ్ లు కూడా వ‌చ్చిన విష‌యం విదిత‌మే.కాక‌పోతే ఇంకా అవి అంద‌రి ద‌గ్గ‌ర‌కు రాలేదు.ఇంతలోనే కొత్త‌గా ఐ-సిమ్ రాబోతుండ‌టం విశేషం.ఇక ఐ-సిమ్ అందుబాటులోకి వ‌స్తే మాత్రం ప్ర‌స్తుతం ఉన్న సిమ్ ల‌న్నీ పారేయాల్సిందేన‌ట‌.

ప్ర‌స్తుత‌ సిమ్‌కార్డులకు ప్రత్యామ్నాయం!
స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణం మరింత తగ్గించేందుకు తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.కానీ కొన్ని సవాళ్లను అవి దాటలేకపోతున్నాయి.స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ, సిమ్‌కార్డు స్లాట్‌లు అధిక స్థలాన్ని ఆక్రమిస్తున్నాయి.ఈ సమస్యకు ఏఆర్‌ఏం సంస్థ ఒక కొత్త తరహా పరిష్కారం చూపిస్తోంది.ఎలాంటి స్లాట్‌ అవసరం లేని సిమ్‌కార్డును తయారు చేసింది.దీన్ని ఐ-సిమ్‌గా పిలుస్తున్నారు.ప్రపంచంలోని దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు ఈ సంస్థ చిప్‌లను తయారు చేస్తోంది.

అసలు ఐ సిమ్ అంటే ఏమిటి?
సిమ్‌ కార్డుతో చేసే అన్ని పనులను ఐ సిమ్‌తో చేసుకోవచ్చు.ఫోన్‌ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్‌ పంపించొచ్చు. డేటా వాడుకోవచ్చు. ఇతర అన్ని సేవలూ పొందవచ్చు.నానో, ఇ సిమ్‌లను స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న సిమ్‌ స్లాట్‌లో వేసుకోవాల్సి ఉంటుంది.కానీ ఐ సిమ్‌కు అలాంటి అవసరం ఉండదు. ఐ సిమ్‌ డీఫాల్ట్‌గా సెల్‌ఫోన్‌లో ఉండే చిప్‌లోనే ఉంటుంది.
ప్రాసెసర్‌లో ఉండే దీన్ని ఎస్‌ఓసీ అంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు సిమ్ పని చేసేలా చేస్తాయి. దీనికి ప్రత్యేకంగా సిమ్ స్లాట్‌ అవసరం లేదు.అయితే, సిమ్‌కార్డు పూర్తిగా అదృశ్యం అవుతుందని కాదు. కానీ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌లోనే దాన్ని ఏర్పాటు చేస్తారు.ఐ సిమ్‌ ఎంత పరిమాణంలో ఉంటుందో ఇప్పటి వరకైతే కచ్చితంగా తెలియదు.
కానీ ఒక చదరపు మిల్లీ మీటర్‌ కంటే చిన్నగా ఉంటుందని కేంబ్రిడ్జికి చెందిన సంస్థ అంచనా వేస్తోంది.

ఐ సిమ్ ఉపయోగాలు ఏంటి?
ఐ సిమ్ వల్ల సిమ్‌కార్డు పోతుందనే భయం ఉండదు.స్క్రాచ్‌పడి పనికిరాకుండా పోతుందన్న ఆందోళన ఉండదు. ఎందుకంటే ఐ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌లోనే ఉంటుంది.ఐ సిమ్‌ వల్ల ప్రత్యేకంగా ఫోన్‌లో స్లాట్ అవసరం ఉండదు.
అంతేకాదు, తయారీ ఖర్చు కూడా తక్కువేనని ఏఆర్ఎం సంస్థ చెబుతోంది.ఇతర సిమ్‌కార్డుల మాదిరిగానే ఐ సిమ్‌లోనూ ఒక మొబైల్ నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కి మారొచ్చు.ఐ సిమ్‌ను ఒక్క సెల్‌ఫోన్‌లోనే కాదు.. ఇంటర్నెట్‌తో అనుసంధానించే ఇతర పరికరాల్లో (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT) కూడా దీన్ని వాడొచ్చు.
నెట్‌వర్క్‌తో అనుసంధానించే వైర్‌లెస్‌ పరికరాల్లో వాడొచ్చు. ఉదాహరణకు సెన్సర్లు, అప్లికేషన్లు మొదలైనవి.

ఐ సిమ్‌కు టెలిఫోన్‌ ఆపరేటర్లు అంగీకరిస్తారా?
క్వాల్‌కమ్, మీడియా టెక్ వంటి చిప్ తయారీ సంస్థలు ఐ సిమ్‌ను తమ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో చేర్చడంపై పరిశోధనలు చేస్తున్నాయి.ఈ ఏడాది చివరి కల్లా దీని వినియోగం మరింత పెరుగుతుందని ఏఆర్ఎం సంస్థ అంచనా వేస్తోంది.అయితే, ఐ సిమ్‌ను టెలిఫోన్ ఆపరేటర్లు అంగీకరిస్తారా లేదా అన్నది సందేహమే.ఇప్పటికే నానో సిమ్‌కు ప్రత్యామ్నాయంగా ఇ సిమ్ అందుబాటులోకి వచ్చింది. కానీ టెలికం ఇండస్ట్రీ నుంచి ఇ సిమ్‌కి పెద్దగా ఆదరణ లభించడం లేదు.అయితే, ఐ సిమ్ ఆదరణ పొందడానికి కొంత సమయం పడుతుందని ది వెర్జ్ మ్యాగజీన్ ఎడిటర్ జాకబ్ చెప్పారు.2025 నాటికి 4400 మిలియన్ల పరికరాలు ఇంటర్నెట్‌తో అనుసంధానం అవుతాయని మెచినా రిసెర్చ్ సంస్థ నివేదిక చెబుతోంది.ఇంకా రాను రాను ఇంకెంత టెక్నాల‌జీ రానుందో ఊహించ‌డానికి కూడా వీలులేదు.