Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

జువ్వ మూవీ రివ్యూ &రేటింగ్

గతంలో దిక్కులు చూడకు రామయ్య  సినిమాని విభిన్నమైన పాయింట్ తో తీసి ప్రశంసలు అందుకున్న దర్శకుడు త్రికోటి తాజాగా రూపొందించిన సినిమా జువ్వ. బాహుబలి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన సినిమా ఇది. అసలు ఈ ‘జువ్వ’ పైకి ఎగిరిందా లేదా తెల్సుకుందాం.

కథ

హీరో రాణా (రంజిత్) ఒకమ్మాయి స్కూటర్ మీద వెళుతూ డాష్ ఇవ్వడంతో కింద పడటంతో పాటు పనిలో పనిగా ప్రేమలో కూడా పడిపోతాడు. ఆ అమ్మాయి ఎవరంటే, ఓ కోటీశ్వరుడి కూతురు ఆద్య (పాలక్ లల్వానీ). రాణా తెలివిగా ఆద్యని ప్రేమలోకి దింపే ప్రయత్నంలో ఉండగా, హఠాత్తుగా ఆద్యకి ఓ విషయం తెలిసి బెదిరిపోతుంది. స్కూలులో తన తోటి విద్యార్థి బసవరాజు పాటిల్ తన చిన్నతనంలో వెంటపడి వేధించి, ఒక గొడవలో స్కూలు ప్రిన్సిపాల్ ని చంపేసి, 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ బసవరాజు తిరిగి వస్తాడు. జైలు నుంచి విడుదల కాగానే వాడు శ్రుతిని పెళ్లాడాలి అనుకుంటూ వస్తాడు. ఇంతకీ శ్రుతి ఎవరంటే ఆద్యనే. బసవరాజుకి భయపడి, శ్రుతి తన పేరు మార్చుకుని, బాబాయ్ వాళ్లింట్లో పెరుగుతుంటుంది.

బసవరాజుకి భయపడి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పారిపోతుంటే, రాణా ఆమెకి సహాయపడతాడు. అయితే, దారిలో రాణా, బసవరాజు ఫ్రెండ్స్ అవుతారు. శ్రుతి అంటే పిచ్చి ఉన్న ఓ క్రిమినల్, శ్రుతిని పిచ్చిగా ప్రేమించే ఓ హీరో… ఇద్దరికీ ఒకరికొకరు అడ్డుగా మారతారు. ఎవరు ఎవరి మీద పైచేయి సాధించి, శ్రుతిని ఎలా దక్కించుకుంటారన్నది మిగతా కథ.

విశ్లేషణ:

హీరోయిన్ అంటే చిన్నతనం నుంచి పిచ్చి ఉన్న ఒక క్రిమినల్ మైండెడ్ పిల్లాడు. వాడు పెద్దవ్వడమే కాదు, వాడి పిచ్చి కూడా ముదిరిపోయి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఇంకేం పనీపాటా లేనట్లు నలుగురు ఆకు రౌడీల్ని వెంటేసుకుని ఊళ్లు తిరుగుతూంటాడు. వాడి పిచ్చికి అర్థం పర్థం ఉండదు. హీరో అంతకన్నా పనీపాటా లేనివాడు. హీరోయిన్ సైతం అంతకన్నా పనీపాటా లేకుండా తిరుగుతుండే క్యారెక్టర్. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే అర్థం పర్థం లేని కథతో దర్శకుడు ఒక కొత్త హీరోని ఎలా ఎష్టాబ్లిష్ చేయదల్చుకున్నాడో అర్థం కాదు. ఓవరాల్ గా షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా నటించిన డర్ సినిమా కథే అయినా, మధ్యమధ్య మహేశ్ బాబు ఒక్కడు సినిమా కూడా గుర్తొస్తూ ఉంటుంది.

సినిమాలో పాత్రలే ఉన్నాయి తప్ప పాత్రోచితంగా సన్నివేశాలు లేవు. సినిమా నిండా ఖర్చు కనిపిస్తుంది తప్ప కంటెంట్ కనిపించదు. హీరోగా రంజిత్ కి ఇది తొలి పరిచయమే అయినా డాన్సులూ, ఫైట్లలో మంచి ఈజ్ కనబరిచాడు. కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలంటే, అతను ఇంకా చాలా కష్టపడాలి. పాలక్ లల్వానీ ఏదో ఫర్వాలేదనిపించింది. డైలాగులూ, స్క్రీన్ ప్లే, కథాకథనాలు చాలా పేలవంగా ఉన్నాయి. కీరవాణి నిజంగా స్వరపరిచారో, లేదో తెలియదు కానీ, ఒకటి రెండు పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది.

తీర్పు:

మాంచి బడ్జెట్ తో రూపొందించిన ఈ జువ్వ తుస్సుమంది.

రేటింగ్: 2/5