Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

రంగంలోకి కాంగ్రెస్..అభ్య‌ర్థి ఖ‌రారు..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది.ఓడిపోతామ‌ని తెలిసినా యుద్ధానికి సిద్ద‌మ‌వుతోంది. గెల‌వ‌క‌పోయినా పోరాటం చేయ‌టం త‌ప్పు కాద‌న్న భావ‌న‌తో ముందుకెళ్ళేందుకు సీఎల్పీ నిర్ణ‌యించింది.దీంతో ఇక అభ్య‌ర్థిని ఫైన‌ల్ చేయ‌ట‌మే మిగిలుంది.

రాజ్య‌స‌భ ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది.తెలంగాణ‌లో ఖాళీ కానున్న మూడు రాజ్య‌స‌భ స్థానాల్లో ఏక‌గ్రీవంగా త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాల‌ని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.ఒక‌రకంగా చెప్పాలంటే ఆ మూడు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో చేరిన‌ట్లే.కేవ‌లం అధికారికంగా ఎన్నిక నిర్వ‌హించడం, అనంత‌రం ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం మాత్ర‌మే మిగిలుంది.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సైతం రాజ్య‌స‌భ బ‌రిలో దూకాల‌ని చూస్తుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న అంశం. ఖ‌చ్ఛితంగా ఓడిపోతామ‌ని తెలిసి కూడా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తుండ‌టం నిజంగా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యమ‌నే చెప్పాలి. ఎందుకంటే గెలుపు ముఖ్యం కాక‌పోయినా,క‌నీసం గ‌ట్టి పోటీ కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థిని బరిలోకి దింప‌టం నిజంగా సాహ‌స‌మే.

అయితే,ఓడిపోతామ‌ని తెలిసి కూడా పోటీకి దిగే ఆ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌దే తేలాల్సి ఉంది. సీఎల్పీ మాత్రం గ‌ట్టి అభ్య‌ర్థినే బ‌రిలోకి దింపాల‌ని భావిస్తోంది. మాజీ ఎంపీ ర‌వీంద్ర నాయ‌క్,అజారుద్ధీన్ ల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తుంది.వీరితో పాటు పీసీసీ కోశాధికారి గూడురు నారాయ‌ణ రెడ్డి అభ్య‌ర్థిత్వంపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుంది. వీరిలో ర‌వీంద్ర నాయ‌క్ పేరు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లేన‌ని అంటున్నారు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు.

ఇక మార్చి 12 నుంచి తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో సీఎల్పీ నేత జానారెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య‌నేతలంతా హాజ‌ర‌య్యారు.వారిలో ప‌లువురు నేత‌లు రాజ్య‌స‌భ అభ్య‌ర్థిని నిల‌పాల‌ని ప్ర‌తిపాదిస్తే మ‌రికొంత‌మంది మాత్రం వ్య‌తిరేకించిన‌ట్లు తెలుస్తుంది.ఇక దీంతో పాటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.సీఎం కేసీఆర్ వైఫ‌ల్యాల‌ను,టీఆర్ఎస్ స‌ర్కార్ అస‌మ‌ర్థ‌త‌ను,ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేత‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు మూడో కూట‌మి పేరుతో ఆడుతున్న డ్రామాల‌ను,రైతు స‌మ‌స్య‌లు,శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు,రాజ‌కీయ హ‌త్య‌లు,ప్ర‌జాస‌మ‌స్య‌లు,మ‌హిళ‌ల భ‌ద్ర‌త ఇలా మొత్తం 25 అంశాల‌పై అసెంబ్లీలో పోరాటం చేయాల‌ని సీఎల్పీ నిర్ణ‌యించింది.