Wednesday, March 27, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

భ‌య‌ప‌డ్డాడా…భ‌య‌పెట్టాడా…?

నిన్న‌టిదాకా కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై విరుచుకుపడ్డ వాళ్లంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని గాడు అంటూ సంభాషించాడ‌ని కేసిఆర్ పై బీజేపీ నాయ‌కులు ర‌చ్చ ర‌చ్చ చేశారు.కానీ తాజాగా ఆ వివాదానికి చెక్ పెట్టిన కేసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. తాను ప్ర‌ధాని గారు అంటూ చాలా స్ప‌ష్టంగా చెప్పాన‌ని,కానీ ఆ మాట‌ల‌ను వ‌క్రీక‌రించి త‌ప్పుదోవ ప‌ట్టించే య‌త్నం చేశార‌ని బీజేపీపై ఎదురుదాడికి దిగాడు.త‌న‌కు న‌రేంద్ర‌మోదీ అంటే ఎంతో గౌర‌వ‌మ‌ని, ఆయ‌న త‌న‌కు స్నేహితుడ‌ని చెప్పుకొచ్చాడు.

కేసిఆర్ చాలా క్లారిటీగా చెప్ప‌డంతో బీజేపీ నేత‌లు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డ‌ట్లు తెలుస్తుంది.ప‌లువురు నాయకులు మాత్రం మోదీకి భ‌య‌ప‌డే, సంజాయిషీ ఇచ్చుకునేందుకు ప్రెస్ మీట్ పెట్టాడ‌ని చెబుతున్నా, మ‌రికొంత‌మంది మాత్రం కేసిఆర్ వివ‌ర‌ణ‌ను స‌మ‌ర్థిస్తున్నారు.కేసీఆర్ భ‌య‌ప‌డి ఉంటే ప్ర‌ధాన‌మంత్రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పేవాడు,కానీ గంట‌న్న‌ర పాటు సాగిన ప్రెస్ మీట్లో ఎక్క‌డా సారీ చెప్ప‌లేదు.పైగా రాజ్యంగంలో ప్ర‌ధానిని విమ‌ర్శించ‌వ‌ద్ద‌ని ఎక్క‌డైనా ఉందా అంటూ ఘాటుగానే విరుచుకు ప‌డ్డాడు.ఇక ఇంత‌కాలం అన‌ధికారికంగా బీజేపీకి ఒత్తాసు ప‌లుకుతూ వ‌చ్చిన కేసిర్ తాజాగా ఎన్డీయేఏ కూటమిని,బీజేపీ నాయ‌క‌త్వాన్ని భ‌య‌పెట్టేలా వ్యాఖ్యానించాడు.

కాంగ్రెస్ పార్టీతో పాటు,బీజేపీ కూడా దేశాన్ని అభివృద్ధి ప‌రుచుట‌లో ఘోరంగా విఫ‌లం అయ్యాయ‌ని చెప్పిన కేసీఆర్,రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల‌కు ధీటుగా ప్ర‌త్యామ్నాయ వేదిక ఏర్పాటు కాబోతుందంటూ క్లారిటీ ఇచ్చాడు.అవ‌స‌ర‌మైతే కొత్త‌గా ఏర్ప‌డ‌బోయే వేదిక‌కు తానే నాయ‌క‌త్వం వ‌హిస్తానంటూ స్ప‌ష్టం చేశాడు.ఇప్ప‌టివ‌ర‌కు థ‌ర్డ్ ఫ్రంట్ గురించి బ‌హిరంగంగా ఏ నాయ‌కుడు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు,కానీ కేసిఆర్ మాత్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో థ‌ర్డ్ ఫ్రంట్ కానీ,మ‌రోటి కానీ ఏర్పాటు కాబోతుంద‌ని, అది మోదీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశాడు.దీంతో కేసిఆర్ పెట్టిన ప్రెస్ మీట్ భ‌య‌ప‌డి వివ‌ర‌ణ ఇచ్చేందుకా… లేక భ‌య‌పెట్ట‌డానికా అన్న సందేహం ప‌లువురిలో తలెత్తుతోంది.

కేంద్రంలో ఉన్న పార్టీ పెద్ద‌న్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూస్తూ, నిధులు కేటాయింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అభివృద్ధికి పాటుప‌డాల్సింది పోయి స్వార్థ రాజ‌కీయాల కార‌ణంగా కొన్నిరాష్ట్రాల‌పై చిన్న చూపు చూస్తోంద‌ని మండిపడ్డ కేసీఆర్ ఇక తానేంటో ముందు ముందు మీరే చూస్తారంటూ మీడియాకు స్ప‌ష్టం చేశాడు.త‌న వ‌య‌సు ఏమీ అయిపోలేద‌ని,ప్ర‌స్తుతం 64 ఏళ్ల వ‌య‌సున్న తాను అవ‌స‌ర‌మైతే ఇక‌మీద‌ట దేశ రాజ‌కీయాల‌ను శాసించే బృహ‌త్త‌ర కార్యాన్ని త‌న భుజాల‌మీద వేసుకునేందుకు సిద్ద‌మే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

దీన్ని బ‌ట్టి చూస్తుంటే కేసిఆర్ త్వ‌ర‌లోనే జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.టీఆర్ఎస్ పార్టీ చిన్న‌దే అయినా,ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకుని ఓ శ‌క్తిగా ఎదిగేందుకు స‌న్నాహాల‌ను షురూ చేసిన‌ట్లు తెలుస్తుంది.అదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ పార్లెమెంట్ కు పోటీ చేసే ఛాన్స్ ఉంది.ఇక టీఆర్ఎస్ బాధ్య‌త‌ల‌ను, తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ చేతుల్లో పెట్ట‌డం ఖాయ‌మ‌న్న వార్త‌లు జాతీయ స్థాయిలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.మొత్తానికి కేసిఆర్ చేసిన వ్యాఖ్య‌లు జాతీయ స్థాయిలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.మొదీకి త‌గ్గ నాయ‌కుడు ఉద్భ‌వించాడ‌ని,థ‌ర్డ్ ఫ్రంట్ కు కేసిఆరే శ్రీకారం చుట్ట‌బోతున్నాడంటూ ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. మ‌మ‌తా బెనర్జీ, న‌వీన్ ప‌ట్నాయ‌క్, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, స్టాలిన్,మాయావ‌తి,ల‌తో పాటు ప‌లు పార్టీల‌ను క‌లుపుకునేందుకు కేసిఆర్ ప్ర‌యత్నాలు ముమ్మరం చేశాడ‌ని అంటున్నారు జాతీయ స్థాయి నేత‌లు.