Saturday, June 23, 2018

కట్టప్ప కు విగ్రహం కట్టించిన విదేశీయులు

తెలుగు సినిమా పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమా బాహుబలి. చిన్నా , పెద్దా అన్న తేడా లేకుండా ప్రపంచం లో ఉన్న ఎంతో మంది వీక్షించిన సినిమా గా బాహుబలి ని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో బాహుబలి పాత్రతో పాటు గుర్తింపు తెచ్చుకున్న పాత్రలు ఎన్నో ఉన్నాయి. భాల్లాల దేవ, శివగామి, దేవసేన , కట్టప్ప, సకేతుడు ఇలా అన్ని పాత్రలు ధరించిన వారు ఈ సినిమాలో ప్రజల దగ్గర నుండి మన్ననలు పొందారు. ఈ సినిమాలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న పాత్ర ఏది అని అడిగితె మాత్రం అందరూ కలిసి చెప్పే పేరు కట్టప్ప పాత్ర.

 

అయితే బాహుబలి ఒక్కడికే విగ్రహం పెట్టడం ఎందుకు  ఈ సారి కట్టప్పకు కూడా విగ్రహం పెట్టిద్దాం అనుకున్నారో ఏమో , అనుకున్నదే తడవుగా కట్టప్ప కు కూడా విగ్రహం పెట్టించడానికి సిద్ధం అవుతున్నారు జనాలు. అది కూడా లండన్ లోని తుసాడ్స్ మ్యూజియం లో .కట్టప్ప పాత్రలో ఉన్న సత్యరాజ్ మైనపు బొమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాబోతున్నారు. ఈ మేరకు మ్యూజియం నిర్వాహకులు సత్యరాజ్ కు సమాచారం కూడా అందించారు. త్వరలోనే వచ్చి కొలతలు తీసుకుంటామని సత్యరాజ్ కు తెలిపారు.

సాధారణంగా ఒకళ్ళ మైనపు విగ్రహ ప్రతిష్ట చేసే ముందు వారి దగ్గర అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత వారి దగ్గరికి వచ్చి వారి శరీరపు కొలతలు తీసుకుని తారీ మొదలుపెడతారు. ఇందుకోసమే, సత్యరాజ్ ను వారు సంప్రదించారు అని తెలుస్తోంది.

ఇకపోతే తమిళ సినిమా పరిశ్రమ లో , కమల్ హాసన్ , రజినీ కాంత్ కి కూడా దొరకని గుర్తింపు ఇప్పుడు సత్యరాజ్ కి లభించ నుండటం విశేషం. ఎందుకంటే అలా మేడం తుసాడ్స్ మ్యూజియం లో మొట్ట మొదట మైనపు విగ్రహం పొందబోతున్న తమిళ నటుడు సత్య రాజ్. నిజానికి సత్యరాజ్ ఒకప్పటి స్టార్ హీరో. రజినీ కాంత్ , కమల హాసన్ కి చాలా కాలం పాటు పొటీ ఇచ్చిన నటుల్లో ఒకడు. ఆ తరువాత కావేరి జల వివాద సమయంలో కూడా , రజినీ కాంత్ ని బహిరంగంగా నిలదీసిన వారిలో కూడా సత్య రాజ్ ఒకరు.

ఏది, ఏమైనా ప్రస్తుతం సత్యరాజ్ సాధించిన ఈ ఘనతపై కోలివుడ్ ప్రముఖులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతక ముందు బాహుబలి ప్రభాస్ విగ్రహాన్ని మేడం తుసాడ్స్ వారు , బ్యాంకాక్ లో తెరిచిన బ్రాంచ్ లో ప్రతిష్టించారు.ఇక్కడ విశేషం ఏంటంటే , కట్టప్ప మైనపు విగ్రహాన్ని ఏకంగా లండన్ లోని మెయిన్ బ్రాంచ్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయం పై దేశ వ్యాప్తంగా పలువురు నటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.