Saturday, June 23, 2018

కడదాకా టీఆర్ఎస్‌ తోనే.. హరీష్ రావు ఉద్వేగ ప్రసంగం

తెలంగాణ మంత్రి హరీష్‌రావు పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పుట్టుక టీఆర్ఎస్‌లోనే… అలాగే తన చావు కూడా టీఆర్ఎస్‌లోనే అని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, దానిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాటే.. తన బాట అని.. ఉద్యమంలో పోరాడిన వాడినని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తనని… కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 12నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తమ ఎజెండా నిర్ణయిస్తామన్నారు. ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.

కోర్టులపై నమ్మకం ఉంది
కోర్టులు, ట్రిబ్యునల్‌పై నమ్మకం ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో రెండో రోజు కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు ముగిశాయి. అలాగే మార్చి 26, 27, 28న ట్రిబ్యునల్‌లో మళ్లీ వాదనలు జరగనున్నాయి. కాగా… శుక్రవారం జరిగిన వాదనల్లో తెలంగాణ లాయర్ చేసిన క్రాస్ ఎగ్జామిన్‌ను మంత్రి హరీశ్‌రావు విన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ట్రిబ్యునల్‌లో ప్రభుత్వ వాదనను బలంగా వినిపించామన్నారు. ఉమ్మడి ఏపీలో ఎంత కొట్లాడినా వాటా దక్కలేదని, న్యాయబద్ధంగా రావాల్సిన వాటా కోసం పోరాడుతున్నామని మంత్రి అన్నారు. కాగా… ఈ విషయంపై కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు స్పందించక పోవడం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. సరి సముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌లా మారుస్తామన్నారు. చెరువు అభివృద్ధి పనుల కోసం రూ.10కోట్లు మంజూరు చేసామని తెలిపారు. అన్ని పట్టణాల్లో మినీట్యాంక్‌బండ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన పెర్కొన్నారు. చెరువులపై ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్క్‌లు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఆయన వివరించారు.