Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

త‌ప్పెవ‌రిది….? ప్ర‌భుత్వానిదా..? ప్ర‌తిప‌క్షానిదా..?

అసెంబ్లీ సాక్షిగా ఆగ‌మాగం చేశారు తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధులు.ఓ ప‌క్క ప్ర‌తిప‌క్షం,మ‌రో ప‌క్క అధికార ప‌క్షం ఎవ‌రు ఎవ‌రికీ, త‌క్కువ కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి స‌భ‌ను గంద‌ర‌గోళంగా మార్చారు.వాస్త‌వాల‌కు విరుద్ధంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున నినాదాలు మొద‌లు పెట్టింది.ప్ల‌కార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.ఇక వాళ్ల‌ను కంట్రోల్ చేసేందుకు ప్ర‌భుత్వం మార్ష‌ల్స్ ను రంగంలోకి దింప‌డంతో ఇటు ఎమ్మెల్యేల మ‌ధ్య‌,మార్ష‌ల్స్ మ‌ధ్య తోపులాట జ‌రిగింది.దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆగ్ర‌హానికి లోనై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వైపు త‌న చేతిలోని హెడ్ ఫోన్స్ ను విస‌ర‌డం,అవి మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి త‌గ‌ల‌డం, వెంట‌నే ఆయ‌న్ను స‌రోజినీ ఆస్పత్రికి త‌ర‌లించ‌డం హుటాహుటినా జ‌రిగిపోయాయి.

అయితే,అసెంబ్లీ ఫుటేజీని ప‌రిశీలిస్తే అక్క‌డ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెడ్ ఫోన్స్ విస‌ర‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.కానీ ఆయ‌న విసిరిన హెడ్ ఫోన్స్ మండ‌లి చైర్మ‌న్ క‌న్నుకు త‌గిలాయా లేదా అన్న‌ది మాత్ర‌మే తెలియ‌రావ‌డం లేదు.ఒక వేళ త‌గిలినా అవి నిజంగానే ప్ర‌భుత్వం విమ‌ర్శిస్తున్నంత స్థాయిలో గాయాన్ని చేశాయా అన్న‌ది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే..

స్వామిగౌడ్ కు గాయాలు అయిన‌ట్లు వైద్యులు చెప్ప‌డాన్ని న‌మ్మాల్సిందే.కానీ దీన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని రాజ‌కీయం చేసేందుకే చిన్న గాయాన్ని పెద్ద‌గా చేసి చూపుతున్నాయ‌నే విమ‌ర్శ కూడా లేక‌పోలేదు.ఇక గాయం చిన్న‌దా,పెద్ద‌దా అన్న‌ది ప‌క్క‌న‌పెడితే ప్ర‌భుత్వం మాత్రం క‌ఠిన చ‌ర్య‌ల‌కు దిగింది.కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి,సంప‌త్ కుమార్ ల శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.మ‌రోవైపు, మిగ‌తా కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను స‌భ‌లోకి రాకుండా స‌స్పెండ్ విధించింది.

గ‌తంలో తెలంగాణ ఉద్య‌మాన్ని ద‌గ్గ‌రుండి చూశాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వెల్ లోకి దూసుకొచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఇక తెలంగాణ రాష్ట్రం కోసం పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రే ఘ‌ట‌న‌ను అప్పుడే మ‌రిచిపోయామా..మైకులు విర‌గొట్టి మ‌రీ చేసిన దాడులు గుర్తుకు లేవంటారా… అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు ఫైట్ చేసింది ప్ర‌జ‌ల కోస‌మే అయిన‌ప్పుడు,ఇప్పుడు ప్ర‌తిప‌క్షాలు పోరాడుతున్న‌ది కూడా ప్ర‌జ‌ల కోస‌మే అని ఎందుకు తెలుసుకోలేరు. అంత స్థాయిలో దాడులు జ‌రిగేదాకా తెచ్చుకున్నందుకు ప్ర‌భుత్వాన్ని నిందించాలా..లేక‌, ప్ర‌తిప‌క్షాలు కావాల‌నే రాద్ధాంతం చేస్తున్నాయ‌ని వాపోవాలో అర్థం గాక ప్ర‌జ‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి మాత్రం ఎదుర‌వుతోంది.

ప్ర‌భుత్వంలో ఉన్నంత మాత్రాన చ‌ర్య‌లు తీసుకున్నామంటే కుద‌రదు.ఒక‌వేళ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేసింది త‌ప్పే అని తేల్చితే గ‌తంలో చేసిన దాడుల‌పై స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా..,? శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం లేదు కానీ,అస‌లు ఘ‌ట‌న జ‌ర‌గ‌లేదని,స్వామిగౌడ్ కు గాయం కాలేద‌ని,అదంతా ప్ర‌భుత్వం ఆడుతున్న నాట‌కమ‌ని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి.ఒక‌వేళ నిజంగా స్వామిగౌడ్ కు దెబ్బ త‌గిలిన‌ట్లుగా సాక్ష్యాలు ఉంటే ఆ వీడియోల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.నిజంగానే కంటికి గాయ‌మైతే తామే రాజీనామా చేస్తామ‌ని అంటున్నా, ప్ర‌భుత్వం మాత్రం ఒక‌వైపే ఆలోచిస్తూ అర్థాంత‌రంగా చ‌ర్య‌లు తీసుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్ రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఓ క‌లికితురాయిలా నిల‌వ‌నుంద‌ని రాజ‌కీయ మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఇక త‌ప్పెవ‌రిది అన్న‌దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.